కృష్ణునికి అష్టభార్యలు కాక ఇంకా 16 వేల మంది భార్యలున్నారు. ఇంతకీ కృష్ణుడు వారి వెంటపడ్డాడా లేక వాళ్ళు ఆయన వెంట పడ్డారా? రుక్మిణీ కళ్యాణం ఎలా జరిగిందో అందరికీ తెలుసు. రుక్మిణీదేవి తనకు శిశుపాలునితో వివాహం జరగబోతోందని, అది తనకిష్టం లేదని, తను కృష్ణుడినే భర్తగా వరించానని,తన్ని శిశుపాలుడి నుంచి రక్షించి, వివాహమాడమని ఒక బ్రాహ్మణుడితో సందేశం పంపింది. దాని ప్రకారం కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. తక్కిన భార్యలను గూడా సాహసకృత్యాలు చేసి గెలిచి మరీ వివాహమాడాడు. ఇంక 16 వేల మంది రాచకన్యలను ఎలా పెళ్ళాడాడన్నది చూద్దాం. నరకాసురుడు వామాచార పూజల కోసం16 వేలమంది రాచకన్యలను బంధించి అత్యాచారం చేసాడు. నరకుడ్ని సంహరించాక కృష్ణుడు వారిని వారి రాజ్యాలకు వెళ్ళిపొమ్మన్నాడు. వారు తాము తమరాజ్యాలకు వెళ్ళమని చెప్పి, కృష్ణుడ్నే పతిగా కావాలని వేడుకున్నారు. వారి ప్రార్థనలు మన్నించి వారిని తాను వివాహమాడాడు. వారికి తన భార్యల స్థానాలిచ్చి వారి గౌరవాన్ని పెంచాడు. అదీ కృష్ణుని ఔన్నత్యం. గోపికలతో రాసక్రీడలాడాడంటారు. భాగవతంలోనే ఉంది గోపికలంటే పూర్వజన్మల్లో తపస్సు చేసినవారు. వారికి ముక్తినివ్వడానికే ఆయన వారిని దగ్గరకు చేరదీసాడు. ఐనా ఆయన పరమాత్ముడు గనక ఆయన సృష్టిలోని వారే అందరూ గనక ఆయన ఏంచేసినా చెల్లుతుంది. అందుకే ఆయన భూమ్మీద అవతరించి కొందరిని అనుగ్రహించాడు, కొందరిని శిక్షించాడు. అందుకే ఆయనవి కృష్ణలీలలు అంటారు.